మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో ఖర్జూరాలు కూడా ఒకటి. ఇవి మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. రంజాన్ మాసంలో కేవలం ముస్లింలు మాత్రమే వీటిని తింటారని అనుకుంటే పొరపాటు. వీటిని ఎవరైనా, ఎప్పుడైనా తినవచ్చు. ఖర్జూరాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక బరువు:
ఖర్జూరాలు బాగా తీయగా ఉంటాయి. అందువల్ల వాటిని తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఖర్జూరాల్లో ఫైబర్ ఉంటుంది. దీనివల్ల తక్కువ తిన్నా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండవచ్చు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో శరీరానికి అందే క్యాలరీలు తగ్గుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గవచ్చు. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయడ్స్, పాలిఫినాల్స్ శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. శరీర మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు.
2. ఒత్తిడి, డిప్రెషన్:
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి 6 సెరటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు నోర్పైన్ఫ్రైన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. విటమిన్ బి6 తక్కువగా ఉంటే డిప్రెషన్ పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండవచ్చు. ఖర్జూరాల్లో ఈ విటమిన్ ఉంటుంది కనుక మనకు ఎంతగానో మేలు కలుగుతుంది.
3. శక్తి స్థాయిల:
ఖర్జూరాల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ శరీరంలో శక్తిని పెంచుతాయి. ఎప్పుడూ అలసటగానే ఫీలయ్యేవారు ఖర్జూరాలను తినడం వల్ల శక్తిని పుంజుకుంటారు. వ్యాయామం చేసే వారు వీటిని తింటే త్వరగా శక్తి అందుతుంది.
4. గుండె జబ్బులు:
ఖర్జూరాల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
5.పెద్ద పేగు క్యాన్సర్:
ఖర్జూరాలను నిత్యం తినడం వల్ల పెద్ద పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. సైంటిస్టుల పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
6. సీజనల్ అలర్జీలు:
ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి సీజన్లు మారే కొద్దీ ఎలర్జీలు వస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే ఖర్జూరాలను తినాలి.
7. మెదడు పనితీరు:
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 సెరటోనిన్ ను పెంచుతుంది. దీనివల్ల మెదడు యాక్టివ్ గా మారుతుంది. ముఖ్యంగా చిన్నారులు చదువులలో రాణిస్తారు. శక్తి పెరుగుతుంది.
8. హెమరాయిడ్స్:
మలబద్ధకం వల్ల చాలా మందికి హెమరాయిడ్స్ వస్తుంటాయి. వీటిని మొలలు అంటారు. దీంతో చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటివారు ఖర్జూరాలను తినడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మలబద్దకం కూడా తగ్గుతుంది.