You are here
Home > viral

కుక్క‌ల‌కు మ‌రియు భార‌తీయుల‌కు ప్ర‌వేశం లేదు…. ఈ బోర్డ్ చూడ‌గానే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన ధీరురాలు.!

భార‌త‌దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను అర్పించారు. బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా పోరాడారు. వారంద‌రినీ ప్ర‌స్తుతం మ‌నం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఎంతో మంది అమ‌ర‌వీరుల గురించి మాత్రం మ‌న‌లో ఇంకా చాలా మందికి తెలియ‌దు. స్వాతంత్య్ర పోరాటంలో వారు చూపిన తెగువ అసాధార‌ణం. బ్రిటిష్ వారిపై పోరులో వారు త‌మ ప్రాణాల‌ను కూడా త్యాగం చేశారు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. వారిలో ప్రీతిలత‌ వ‌డ్డేదార్ కూడా ఒక‌రు. ఆమె 21 ఏళ్ల వ‌య‌స్సులోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ.. స్వాతంత్య్రోద్య‌మంలో త‌న‌ ప్రాణాల‌ను అర్పించింది.

ప్రీతిల‌తాది చిట్ట‌గాంగ్‌. ఇది ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది. ఆమె 1911 మే 5వ తేదీన జ‌న్మించారు. మ‌ధ్య త‌ర‌గతి కుటుంబం. చిట్టగాంగ్‌, ఢాకాల‌లో ఆమె విద్యాభ్యాసం కొన‌సాగింది. ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచి విప్ల‌వ భావాలు, దేశ‌భ‌క్తి ఎక్కువ‌గా ఉండేవి. అయితే ఆమె కోల్‌క‌తాలోని బెథునె కాలేజీలో ఉన్న‌త విద్య‌కు అక్క‌డికి చేరుకుంది. అదే స‌మ‌యంలో సుభాష్ చంద్రబోస్‌కు స‌హాయ‌కురాలిగా ప‌నిచేసి‌న లీలా నాగ్ అనే ఓ విద్యార్థిని ఏర్పాటు చేసిన దీపాలి సంఘ అనే ఓ విప్ల‌వ సంఘం పట్ల ఆక‌ర్షితురాలై.. ప్రీతిలత‌ అందులో చేరింది. అందులో మ‌హిళ‌ల‌కు యుద్ధ నైపుణ్యాల్లో శిక్ష‌ణ ఇచ్చేవారు.

కాగా 1930ల‌లో చిట్టగాంగ్‌లోని బ్రిటిష్ వారికి చెందిన ఓ ఆయుధాగారంపై దీపాలి సంఘ స‌భ్యులు దాడి చేయాల‌నుకున్నారు. అక్క‌డి మందు గుండు సామ‌గ్రి, తుపాకుల‌ను తీసుకోవ‌డంతోపాటు అక్క‌డ నెల‌కొల్ప‌బ‌డిన టెలిఫోన్‌, టెలిగ్రాఫ్ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేయాల‌నుకున్నారు. అందుకుగాను చిట్ట‌గాంగ్ వాస్త‌వ్యురాలైన‌ ప్రీతిల‌త‌కు ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆమె.. మ‌రికొంద‌రు దీపాలి సంఘ సభ్యులు.. మొత్తం 65 మంది క‌లిసి స‌ద‌రు ఆయుధాగారంపై దాడి చేశారు. కానీ వారికి మందుగుండు సామ‌గ్రి, తుపాకులు ల‌భ్యం కాలేదు. అయిన‌ప్ప‌టికీ వారు టెలిఫోన్‌, టెలిగ్రాఫ్ లైన్ల‌ను నాశ‌నం చేశారు.

ఇక చిట్ట‌గాంగ్‌లోనే ఉండే పహ‌ర్త‌లి అన‌బ‌డే యురోపియ‌న్ క్ల‌బ్‌పై కూడా వారు దాడి చేశారు. ఆ క్ల‌బ్ ‌వారు దాని బ‌య‌ట Indians and dogs are not allowed అన‌బ‌డే బోర్డు పెట్టారు. భార‌తీయుల‌ను అవ‌మాన ప‌రుస్తూ పెట్టిన ఆ బోర్డుపై దీపాలి సంఘ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందులో భాగంగానే వారు ప్రీతిల‌త‌ నేతృత్వంలో 1932 సెప్టెంబ‌ర్ 23వ తేదీన ఆ క్ల‌బ్‌పై దాడి చేశారు. అయితే ఆ దాడిలో అనేక మంది స‌భ్యుల‌కు గాయాల‌య్యాయి. బ్రిటిష్ వారు ఆ స‌భ్యుల‌పై తుపాకుల‌తో కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో ప్రీతిల‌త‌కు కూడా గాయ‌ల‌య్యాయి. కానీ వాటితో ఆమెకు పెద్ద ప్ర‌మాద‌మేమీ సంభ‌వించ‌లేదు. అయితే బ్రిటిష్ అధికారులు ఆ స‌భ్యుల‌ను త‌రుముతుండ‌డంతో వారికి తాను ఎక్క‌డ ప‌ట్టుబ‌డ‌తానోన‌ని భావించిన ప్రీతిల‌త‌ ఆత్మార్ప‌ణం చేసుకుంది. పొటాషియం స‌య‌నైడ్ మింగి బ్రిటిష్ వారికి దొర‌క‌కుండా త‌ప్పించుకుంది. త‌న ప్రాణాల‌ను దేశం కోసం త్యాగం చేసింది. అప్పుడామె వ‌య‌స్సు కేవ‌లం 21 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే.

అయితే ఆ స‌మ‌యంలో ఆమెతోపాటు.. మ‌రికొంద‌రు యువ‌తీ యువ‌కులు బ్రిటిష్ వారి ఆధ్వ‌ర్యంలో న‌డిచే బెథునె కాలేజీ నుంచి డిగ్రీలు తీసుకునేందుకు నిరాక‌రించారు. అయిన‌ప్ప‌టికీ 2012 మార్చిలో యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌ల‌క‌త్తా ఆమెకు బ్యాచిల‌ర్ ఆర్ట్స్‌లో డిగ్రీని ప్ర‌దానం చేసింది. 1932వ సంవ‌త్సరానికి గాను ఆమె డిస్టింక్ష‌న్‌లో పాసైన‌ట్లు డిగ్రీని ఆమె పేరిట ఏర్పాటు చేసిన బిర్‌క‌న్యా ప్రీతిల‌త ట్రస్టుకు అంద‌జేశారు. ఇక ప్రీతిల‌త‌కు చెందిన విగ్ర‌హాన్ని కోల్‌క‌తాలోని ఇందిరా గాంధీ స‌ర‌ని అనే రోడ్డులో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రీతిల‌త గురించి దాదాపుగా బెంగాలీలు, చిట్ట‌గాంగ్ వాసుల‌కు త‌ప్ప చాలా మందికి తెలియ‌దు. అనేక మంది ఆమె చేసిన త్యాగాన్ని మ‌రిచిపోయారు. కానీ భార‌త‌జాతి మాత్రం ఆమె చూపిన తెగువ‌ను, ఆమె ఆత్మార్ప‌ణాన్ని ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంది..!

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top