కార్ల తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటాయి. అయితే కొన్ని మోడల్స్ మాత్రం ప్రజలకు ఎప్పటికీ గుర్తుంటాయి. అలాంటి మోడల్స్ ఏళ్ల గడిచినా వినియోగదారులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. అయితే కొత్త మోడల్స్ వచ్చే కొద్దీ పాత మోడల్స్ ను మార్కెట్లో విడుదల చేయడం ఆపేస్తారు. కానీ వినియోగదారులు మాత్రం ఇప్పటికీ కొన్ని పాత మోడల్స్ ఉంటే బాగుండును.. అని భావిస్తుంటారు. అలాంటి పాత మోడల్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. టాటా సియెర్రా
దేశంలో విడుదలైన తొలి ఎస్‌యూవీగా ఈ కార్ ప్రసిద్ధిగాంచింది. 1991లో టాటా మోటార్స్ ఈ కార్‌ను లాంచ్ చేసింది. ఇందులో అప్పట్లోనే ఏసీ, ఎలక్ట్రిక్ విండోస్, టాకోమీటర్, అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను ఇచ్చారు. అయితే ఈ మోడల్‌కు గాను ఎలక్ట్రిక్ వేరియెంట్‌ను టాటా మోటార్స్ లాంచ్ చేయాలని చూస్తోంది. కానీ ఈ కార్ ఎప్పటి వరకు మార్కెట్లో విడుదల అవుతుంది అన్న వివరాలు తెలియదు. టాటా కూడా వాటి గురించి ప్రకటన ఏమీ విడుదల చేయలేదు.
2. హిందుస్థాన్ కాంటెస్సా
1984లో ఈ కార్‌ను హిందుస్థాన్ కంపెనీ లాంచ్ చేయగా 2002 లో ఈ కార్‌ను ఆపేశారు. 1976 వాక్స్హాల్ వీఎక్స్ సిరీస్ కార్‌ను పోలి ఈ కార్ ఉంటుంది. అప్పట్లోనే ఈ కార్ ధర రూ.4.84 లక్షల నుంచి రూ.5.42 లక్షలుగా ఉండేది. అప్పట్లో టాటా, హుండాయ్, మారుతి కంపెనీలతో ఈ కంపెనీ పోటీ పడలేకపోయింది. దీంతో కంపెనీ కూడా మూతపడింది.
3. హిందుస్థాన్ అంబాసిడర్
ఈ కార్ ఇప్పటికీ మనకు రోడ్లపై దర్శనమిస్తుంటుంది. దీన్ని ఒకప్పుడు వీఐపీలు ఎక్కువగా ఉపయోగించేవారు. 1957లో ఈ కార్ లాంచ్ కాగా 57 ఏళ్ల పాటు ఈ కార్ మనుగడలో ఉంది. అయితే దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.
4. మారుతి 800
ఈ కార్‌ను కూడా ప్రజలు విపరీతంగా కొనుగోలు చేశారు. చాలా చీప్ ధరను కలిగి ఉండడమే ఇందుకు కారణం. ఈ కార్‌ను 1983లో లాంచ్ చేయగా 2014 వరకు కొనసాగించారు. తొలి తరం 800 కార్ 793 సిసి ఇంజిన్‌ను కలిగి 35 బీహెచ్పీ పవర్‌ను ఇచ్చేది. తరువాత వచ్చిన కార్లు 800 సీసీ ఇంజిన్‌తో 45 బీహెచ్పీ పవర్ ను ఇచ్చాయి. అయితే దీనికి త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియెంట్‌ను లాంచ్ చేయాలని చూస్తున్నారు.
5. మారుతి సుజుకి ఓమ్ని
వాణిజ్యపరంగా ఈ కార్‌ను చాలా మంది ఉపయోగించారు. వ్యాపారాల కోసం ఈ కార్‌ను ఎక్కువగా వాడేవారు. ఇందులో 796 సిసి ఇంజన్ ఉంటుంది. 34 బీహెచ్పీ పవర్‌ను ఇస్తుంది. ఇది ఎల్పీజీ-పెట్రోల్, సీఎన్జీ-పెట్రోల్ ఆప్షన్లలోనూ లభించింది. ఈ కార్కు గాను ఓమ్ని ఈకోను మారుతి సుజికి ప్రస్తుతం అందిస్తోంది.