చేసే కార్యం గొప్పదైతే మనకు ఎలాంటి కష్టాలు ఎదురైనా అవేవీ అడ్డంకులు కావు. అవును.. సరిగ్గా అతను కూడా ఇదే విషయాన్ని నిరూపించాడు. ఓ వైపు అంగవైకల్యం ఉన్నప్పటికీ నిత్యం తన బాధ్యతను మాత్రం మరువలేదు. ఫలితంగా అతన్ని యావత్ ప్రపంచం ప్రస్తుతం కీర్తిస్తోంది. అతనే.. కేరళకు చెందిన 69 ఏళ్ల ఎన్ఎస్ రాజప్పన్.
కేరళలోని కొట్టాయంలో ఉన్న కుమరకోమ్ ప్రాంతం కైప్పుళముట్టు అనే ఏరియాలో నివసించే రాజప్పన్కు 5వ ఏటే పోలియో వచ్చింది. దీంతో అంగ వైకల్యం బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతను తన బంధువుల మీద ఆధార పడి జీవిస్తున్నాడు. అయితే పర్యావరక్షణ పరిరక్షణకు ఇతను కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. నిత్యం ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న చెరువులు, కుంటుల్లో బోటుపై వెళ్తూ వాటిల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. అలా సేకరించిన ప్లాస్టిక్ బాటిల్స్ ను కేజీకి రూ.12 చొప్పున స్థానిక డీలర్లకు విక్రయిస్తాడు.
అయితే ఇప్పటి వరకు అతను అలా ఎన్నో ప్లాస్టిక్ బాటిల్స్ ను ఏరి పారేశాడు. దీంతో అతను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మెచ్చుకున్నారు. రాజప్పన్లాగే మనమూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కొంత సహాయం చేయాలని అన్నారు. ఇక ఇతని గురించి ఓ యూట్యూబర్ వీడియోను తీసి పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజప్పన్ ఫేమస్ అయ్యాడు.
ఇక యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) చీఫ్ ఎరిక్ సొల్హెయిమ్ కూడా రాజప్పన్ను ప్రశంసించారు. దీంతో రాజప్పన్ పేరు ప్రపంచానికి కూడా తెలిసింది. అందరూ అతని లాగే బాధ్యతగా వ్యవహరిస్తే మన పర్యావరణాన్ని రక్షించుకోవడం నిజంగా చాలా తేలికవుతుంది.