తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఓవరాల్‌గా భారతీయ సినీ ఇండస్ట్రీలోనే బాహుబలి చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రంగా పేరుగాంచింది. అయితే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం కూడా సరిగ్గా అదే స్థాయిలో గుర్తింపు పొందింది.
సూపర్ స్టార్ కృష్ణకు జానపద చిత్రం తీయాలని ఎంతో కోరికగా ఉండేది. కానీ అందుకు బీజం మాత్రం 1980లలో పడింది. ఆయన సింహాసనం కథతో సిద్ధమయ్యారు. కానీ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుంది. అయితే నిర్మాతలను రిస్క్‌లో పెట్టడం ఎందుకని తానే స్వయంగా తన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై సింహాసనం చిత్రాన్ని తీసేందుకు నిర్ణయించుకున్నారు. ఇక దర్శకుల కోసం వెదికారు కానీ ఆయన ఆలోచనలతో సరిపోలలేదు. అందువల్ల కృష్ణనే స్వయంగా దర్శకత్వం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన సింహాసం చిత్రం గురించి తొలిసారిగా పేపర్లో యాడ్ ఇచ్చారు.
అయితే కృష్ణ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు కదా, ఇక దర్శకుడిగా మారడం ఎందుకని అప్పట్లో చాలా మంది విమర్శించారు. అయినా కృష్ణ వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకు సినిమా నిర్మాణం చేపట్టారు. సినిమా తీస్తున్న సమయంలో నిత్యం పేపర్లలో షూటింగ్‌కు సంబంధించిన వార్తలు వచ్చేవి. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఆ వార్తలను చదివేవారు. ఇక ఇందులో బాలీవుడ్ ఫేమస్ మందాకిని నటిస్తుండడం, మరో వైపు జయప్రద, రాధ వంటి నటీమణులు ఉండడం, బప్పీలహరి వంటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతాన్ని అందిస్తుండడంతో సింహాసనం మూవీ పట్ల ఫ్యాన్స్‌లో రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ సింహాసనం మూవీని మార్చి 21, 1986వ తేదీన తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేశారు. హిందీలో ఈ మూవీ సింహాసన్ పేరిట విడుదలైంది. అందులో జితేంద్ర హీరోగా నటించారు. అయితే ఊహించిన దానికన్నా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎక్కువ స్పందన లభించింది
మూవీకి రూ.3.50 కోట్ల బడ్జెట్ అయింది. చిత్రాన్ని హైదరాబాద్, బెంగళూరు, ఊటీల్లో నిర్మించారు. కానీ మూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. అప్పట్లో సగటు మూవీ బడ్జెట్ రూ.50 లక్షలు కాగా ఈ మూవీకి అంత ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయినప్పటికీ భారీ స్థాయిలో లాభాలు వచ్చాయి. ఈ మూవీ గురించి జాతీయ స్థాయిలోనూ అప్పట్లో బాగా చర్చ జరిగింది. ఇక సినిమాకు కేవలం 53 రోజుల్లోనే షూటింగ్ చేసి విడుదల చేయడం మరొక విశేషం. ఈ మూవీకి కృష్ణ నిర్మాత, దర్శకత్వం వహించడమే కాదు, ఎడిటర్ గా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను అన్నింటినీ ఆయనే దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు.
ఇక సింహాసం మూవీ బాగుందని టాక్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ పెరిగాయి. థియేటర్ల వద్ద జనాలు బారులు తీరారు. జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. 70ఎంఎం లో విడుదలైన తొలి తెలుసు సినిమా ఇదే కాగా ఈ మూవీకి కృష్ణ యాక్టింగ్, సెట్టింగ్‌లు, హీరోయిన్లు ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు. ముఖ్యంగా మూవీలో మందాకిని నర్తించిన ఆకాశంలో ఒక తార పాటకు ప్రేక్షకుల నుంచి అపూర్వ రీతిలో స్పందన లభించింది. మూవీ బాక్సాఫీస్ వద్ద అనేక సంచలనాలను సృష్టించింది. మొదటి వారం రూ.1.51 కోట్ల గ్రాస్‌ను సాధించి ఆల్ టైం రికార్డును సృష్టించింది. సింగిల్ థియేటర్లో ఏకంగా రూ.15 లక్షల గ్రాస్ సాధించింది. వైజాగ్‌లో ఈ మూవీ 100 రోజుల పాటు నాన్‌స్టాప్ గా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌లో రికార్డులు సృష్టించింది. 3 కేంద్రాల్లో ఈ మూవీ రూ.10 లక్షలకు పైగా వసూళ్లు చేసింది. అలాగే ఓవరాల్‌గా రూ.4.50 కోట్ల షేర్ సాధించింది.
సింహాసనం మూవీ 40 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఐదు 70 ఎంఎం థియేటర్లలో 100 రోజులు జరుపుకున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. 1986 జూలైలో ఈ మూవీకి చెన్నైలో శత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5వేల మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. కానీ కృష్ణ అభిమానులు ఏకంగా 400 బస్సుల్లో వెళ్లారు. దీంతో సభలో స్థలం సరిపోలేదు. 12 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాం అయింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, జితేంద్రలను పిలిచారు. కానీ ట్రాఫిక్ జాంలో కష్టపడి వారు వచ్చి వేదిక మీదకు వెళ్లారు. ఇక హీరోయిన్లు రాధ, జయప్రద, మందాకినిలు ట్రాఫిక్ జాంలో ఉండి ప్రోగ్రామ్ కు రాలేకపోయారు.
కృష్ణ ఒక గొప్ప హిట్ జానపద చిత్రాన్ని తీయాలని అనుకుని అందులో విజయవంతం అయ్యారు. అయితే ఆ మూవీ వల్ల ఎంతో మంది లైఫ్ మారిపోయింది. ఎంతో మంది నటులు, టెక్నిషియన్లు ఆ మూవీతో స్థిర పడ్డారు. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సింహాసం మూవీని తీయగా అది ఆ తరువాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అయితే ఆ మూవీ వచ్చాక 30 ఏళ్లలో అంతటి స్థాయిలో వసూళ్లను సాధించి పేరు తెచ్చుకుంది ఒక్క బాహుబలి చిత్రం మాత్రమే కావడం విశేషం.