You are here
Home > viral

మ‌ధ్యాహ్నం కాగానే నీడ మాయ‌మౌతుంది….1000 ఏళ్ళ క్రితం క‌ట్టిన తంజావూరు ఆల‌యం ప్ర‌త్యేక‌త‌లు.!

మన దేశంలోని అనేక పురాతన ఆలయాల్లో తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్‌ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి తంజావూరు అని పేరు వచ్చింది. తంజావూరును ది రైస్‌ బౌల్‌ ఆఫ్‌ తమిళనాడు అని కూడా పిలుస్తారు. చోళులు పరిపాలించినప్పుడు ఈ పట్టణం వారికి ముఖ్య కేంద్రంగా ఉండేది. సుమారుగా 1000 సంవత్సరాల కిందట బృహదీశ్వరాలయాన్ని చోళులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని నిర్మించాకే తంజావూరు పట్టణంగా విస్తరించింది.

ఇక ఈ ఆలయ గోపురం నిర్మాణానికి గాను చోళులు అప్పట్లోనే 80 టన్నుల బరువు ఉండే గ్రానైట్‌ను 216 అడుగుల ఎత్తుకు పైకి లేపారు. ఇది ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడంటే ఆధునిక పరికరాలతో ఎంత బరువున్న వస్తువులనైనా పైకి లేపుతున్నారు. కానీ అప్పట్లో అది ఎలా సాధ్యమైందనే విషయం ఇప్పటికీ ఇంజినీర్లకు అంతుబట్టని మిస్టరీగా మారింది.

ఈ ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మధ్యాహ్నం కాగానే ఆలయం నీడ మాయమవుతుంది. ఆ సమయంలో నీడ భూమిపై అస్సలు కనిపించదు. ఇది కూడా విశేషమే.

బృహదీశ్వర ఆలయం ప్రపంచంలోని ఎత్తైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. అందువల్లే మధ్యాహ్నం తరువాత ఆలయ శిఖరానికి చెందిన నీడ భూమిపై పడదని చెబుతారు.

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కారిడార్‌లో రెండు గణేషుని విగ్రహాలు ఉంటాయి. వాటిని తాకితే ఆ రాళ్ల నుంచి శబ్దం వినిపిస్తుంది. వాటిలో ఒక విగ్రహం నుంచి వచ్చే శబ్దం లోహాన్ని పోలి ఉంటుంది. అప్పట్లో నాట్య కళాకారులు, సంగీతకారులు శివునికి సేవ చేస్తూ ఆ ప్రదేశంలో నృత్యాలు చేసేవారట. సంగీత వాయిద్యాలు వాయించేవారట. ఇక అక్కడే పలురకాల మ్యూజిక్‌ పిల్లర్లు ఉంటాయి. వాటిని తాకితే భిన్నరకాల శబ్దాలు మనకు వినిపిస్తాయి.

ఆలయం మొత్తాన్ని గ్రానైట్‌తో నిర్మించారు. కానీ అక్కడికి 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా గ్రానైట్‌ లేదు. అంటే.. ఎక్కడో ఉన్న గ్రానైట్‌ రాళ్లను ఇక్కడికి తరలించి వాటితో ఆలయాన్ని నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. అంత భారీ రాళ్లను అన్ని కిలోమీటర్ల దూరం ఎలా తరలించి ఉంటారనేది ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మారింది.

ఇక ఈ ఆలయం ఎత్తు 60.96 మీటర్లు ఉంటుంది. ప్రధాన ముఖ ద్వారం వద్ద ఎత్తు 30 మీటర్లు ఉంటుంది. అయితే యూకేలోని అత్యంత ఎత్తయిన నిర్మాణం బిగ్‌బెన్‌ క్లాక్‌ టవర్‌ (96.3 మీటర్ల ఎత్తు)ను 1858లో నిర్మించగా అది ఇప్పుడు 0.26 డిగ్రీల కోణంలో ఒక వైపుకు వంగింది. అలాగే ఇటలీలోని లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా(56.7 మీటర్ల ఎత్తు)ను 1264లో నిర్మించారు. అది ఇప్పుడు 3.99 డిగ్రీల కోణంలో వంగింది. అలాగే జర్మనీలోని సుర్‌హుసెన్ టవర్‌(27.4 మీటర్ల ఎత్తు)ను 1450లో నిర్మించగా అదిప్పుడు 5.2 డిగ్రీల కోణంలో ఓ వైపుకు వంగింది. కానీ బృహదీశ్వరాలయం (60.96 మీటర్ల ఎత్తు) మాత్రం ఇప్పటికీ నిటారుగా ఉంది. ఏ వైపుకూ వంగలేదు. ఇది మరొక విశేషం.

తంజావూరు వెళ్లేందుకు చెన్నై నుంచి బస్సు, రైలు సదుపాయాలు ఉన్నాయి. తమిళనాడులోని అన్ని పట్టణాల నుంచి తంజావూరుకు బస్సులు నడుపుతారు. తిరుచ్చి అక్కడికి అతి దగ్గర్లో ఉన్న విమానాశ్రయం. అక్కడి నుంచి ఆలయానికి బస్సులో వెళ్లవచ్చు. తంజావూరు మెయిన్‌ బస్‌ స్టాండ్‌ నుంచి ఆలయానికి బస్సులు నడుపుతారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top