ఏవైనా ఉత్సవాలు భారీ ఎత్తున జరిగినప్పుడు, అలాంటి ఇతర కార్యక్రమాల్లో పిల్లలు తప్పిపోతే వారిని వెదికి పట్టుకోవడం వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో కష్టతరం అవుతుంది. అయితే మైక్ మూర్తి ఉంటే ఆ పని చాలా సులభతరం అవుతుంది. అవును.. అంతగా ఆయన పేరుగాంచాడు. ఇంతకీ అసలు ఈయన ఎవరు ? ఎక్కడ ఉంటాడు ? ఏం చేస్తాడు ? అంటే..
తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతం. దేశంలోని ఇతర రాష్ట్రాలే కాదు, విదేశీయులు కూడా ఎంతో మంది రామేశ్వరంకు వస్తుంటారు. 1964లో అప్పుడు మూర్తికి 10 ఏళ్లు. ఓ ఎస్ఐ మూర్తి వాయిస్‌కు ముగ్దుడై మైక్‌లో అనౌన్స్మెంట్ చేయమని అడిగాడు. వెనుకాడకుండా మూర్తి మైక్ అందుకుని ప్రకటన చేశాడు. అందుకు ఓ పోలీస్ అధికారి మెచ్చుకుని మూర్తికి రూ.100 ఇచ్చారు. అప్పట్లో రూ.100 అంటే చాలా పెద్ద మొత్తం. ఇక ఆ తరువాత మూర్తి వెనుదిరిగి చూడలేదు. అప్పటి నుంచి రామేశ్వరం మాత్రమే కాదు, అక్కడి అనేక ప్రాంతాల్లో, ఆలయాల్లో ఉత్సవాలు జరిగినా, అలాంటి కార్యక్రమాలు జరిగినా మూర్తి వెళ్లి మైక్‌లో అనౌన్స్మెంట్లు చేస్తుంటాడు. అందుకు గాను కొంత మొత్తాన్ని తీసుకుంటాడు. ఇలా అప్పటి నుంచి మూర్తి ఆ వృత్తిలోనే ఉన్నాడు. అందుకే అతని పేరు మైక్ మూర్తిగా స్థిరపడిపోయింది.
మైక్ మూర్తికి 8 భాషలు తెలుసు. మాతృభాష తమిళంతో కలిపి ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడగలడు. అందుకనే పోలీసులు ఉత్సవాల సందర్భంగా అనౌన్స్మెంట్ల కోసం ఇతని సేవలను తీసుకుంటారు. ముందుగానే మూర్తికి కాల్ చేసి చెప్పి ఫలానా రోజు ఆ ఉత్సవాలకు రావాలని కోరుతారు. ఇక భిన్న భాషలు తెలుసు కనుక టూరిస్టులకు అప్పుడప్పుడు గైడ్‌లా కూడా ఇతను పనిచేస్తాడు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో మైక్ మూర్తి పేరు చెబితే ఎవరైనా ఇట్టే ఆయన గురించి చెబుతారు. అంతలా మూర్తి అక్కడ పాపులర్ అయ్యాడు.
ఇక మూర్తి గత 50 ఏళ్లుగా ఈ సర్వీస్‌లో ఉండగా.. ఉత్సవాల సందర్భంగా తప్పిపోయిన మొత్తం 48వేల మంది చిన్నారులను ఇప్పటి వరకు సొంత వాళ్ల దగ్గరకు చేర్చాడు. ఒక రోజు అయితే ఒక బాలిక ఆలయంలో ఉత్సవాల సందర్బంగా తప్పిపోతే మూర్తి ఉదయం నుంచి ఏమీ తినకుండా సాయంత్రం వరకు తిరుగుతూ మైక్‌లో అనౌన్స్మెంట్లు చేస్తూ సేవ అందించాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు సాయంత్రం ఆ బాలిక కనిపించింది. ఇక ఉత్సవాల సందర్భంగా దొంగలు చేతివాటం చూపిస్తారు. కానీ మైక్ మూర్తి మాటలు వింటే దొంగలు కూడా మారి తాము కాజేసిన డబ్బు, నగలను తిరిగి ఓనర్లకు ఇస్తారు. ఇలా అనేక సార్లు జరిగింది. అందుకనే మూర్తిని అక్కడ అందరూ ప్రశంసిస్తుంటారు.