You are here
Home > viral

కృష్ణ బియ్యం KG 500! ఏంటీ బియ్యం? దీని స్పెషాలిటీ ఏంటి??

ప్ర‌స్తుతం మ‌న దేశంలో రైతులు అనేక ర‌కాల వ‌రి ధాన్యాల‌ను సాగు చేస్తున్నారు. స‌న్న ర‌కం, దొడ్డు ర‌కం.. ఏదైనా స‌రే వాటిల్లో అనేక ర‌కాల వెరైటీలను రైతులు పండిస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో కృష్ణ బియ్యం అనే ధాన్యాన్ని వారు ఎక్కువ‌గా పండించ‌డం మొద‌లు పెట్టారు. దీన్నే కృష్ణ‌వ్రీహి బియ్యం అని కూడా పిలుస్తున్నారు. ఇటీవలే ప్ర‌ధాని మోదీ ఈ బియ్యం గురించి మాట్లాడ‌డంతో ఇప్పుడు ఎక్క‌డ చూసినా చాలా మంది రైతులు ఈ ర‌కం ధాన్యాన్ని పండించేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే ఇంత‌కీ అస‌లు కృష్ణ బియ్యం అంటే ఏమిటి ? ఈ వెరైటీ అస‌లు మ‌న దేశంలో ఎలా ప్రారంభ‌మైంది ? అంటే..

krishna rice

 

కృష్ణ బియ్యం అనేది నిజానికి సైంటిస్టులు సృష్టించిన కొత్త వ‌రి వంగ‌డం ఏమీ కాదు. పాత‌దే. వేద‌కాలంలోనే మ‌న వాళ్లు ఈ బియ్యాన్ని పండించిన‌ట్లు పురాణాల్లో ఉంది. ముఖ్యంగా ఈ ధాన్యం గురించి వేదాల్లోనూ ప్ర‌స్తావించారు. ప‌రాశ‌ర మ‌హ‌ర్షి రాసిన వృక్ష ఆయ‌ర్వేదంలో దీని ఈ ధాన్యం గురించి వ‌ర్ణించారు. ఈ ధాన్యాన్ని పూర్వ‌కాలంలో యజ్ఞ యాగాదులు, శుభ కార్యాలు, పండుగ‌ల స‌మ‌యంలో ఎక్కువ‌గా ఉపయోగించేవారు. అయితే మ‌న దేశంలో దీన్ని ఇప్పుడిప్పుడే రైతులు సాగు చేస్తున్నారు.

కృష్ణ వ్రీహి ర‌కం ధాన్యానికి మ‌న దేశంలోని మ‌ణిపూర్‌, గోర‌ఖ్‌పూర్ రైతులు జియోగ్రాఫిక‌ల్ ఇండెక్స్ (జీఐ) ట్యాగ్‌ను కూడా సాధించారు. న‌లుపు రంగులో బియ్యం ఉంటాయి క‌నుక వీటికి కృష్ణ బియ్యం అని పేరు వ‌చ్చింది. వీటిని పండించేముందు కృష్ణుడికి, వృష‌భాల‌కు (ఎద్దుల‌కు) పూజ‌లు చేయ‌డం ఒక‌ప్పుడు ఆన‌వాయితీగా ఉండేది. అయితే ఈ బియ్యంలో నిజానికి సాధార‌ణ బియ్యం క‌న్నా ఎక్కువ పోష‌కాలు ఉంటాయి.

ప్ర‌తి 100 గ్రాముల కృష్ణ బియ్యంలో సుమారుగా 8.8 నుంచి 12.5 గ్రాముల ప్రోటీన్లు, 3..3 గ్రాముల కొవ్వులు, 2.4 మిల్లీగ్రాముల ఐర‌న్‌, 58.46 మిల్లీగ్రాముల అమైనో ఆమ్లాలు, 69 నుంచి 74 మిల్లీగ్రాముల ఆంథోస‌య‌నిన్లు ఉంటాయి. అలాగే జింక్‌, కాప‌ర్‌, కెరోటీన్‌, ఫైబ‌ర్‌, ఇత‌ర విట‌మిన్లు, మిన‌రల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కృష్ణ బియ్యంలో స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ బియ్యం శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. మెద‌డు, లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. అలాగే గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ రాకుండా చూస్తుంది. డ‌యాబెటిస్, స్థూల‌కాయం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. అందుక‌నే ఈ బియ్యాన్ని పండించేందుకు, తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ బియ్యానికి ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌రే కాదు, అంత‌ర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అవే వివ‌రాల‌ను మోదీ తాజాగా చెప్పారు.

కృష్ణ బియ్యం పంట కాలం 120 రోజులు. 1 ఎక‌రం పొలంలో 15 నుంచి 20 క్వింటాళ్ల వ‌ర‌కు కృష్ణ బియ్యం పండించ‌వ‌చ్చు. మార్కెట్‌లో క్వింటాల్ కృష్ణ బియ్యం ధ‌ర సుమారుగా రూ.50వేలు ఉంది. కేజీకి అయితే రూ.500 వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతోంది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో రూ.1వేయి నుంచి రూ.2వేల వ‌ర‌కు కిలోకు ధ‌ర ప‌లుకుతోంది. ఈ క్ర‌మంలోనే మోదీ ఈ విష‌యంపై మాట్లాడుతూ.. కృష్ణ బియ్యం పండిస్తున్న రైతులు సంప‌న్నులుగా మారుతున్నార‌న్నారు. ఆస్ట్రేలియాలో ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉంద‌ని తెలిపారు. అక్క‌డ ఈ బియ్యం కేజీకి రూ.850 వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతుంద‌న్నారు. క‌నుక రైతులు కృష్ణ‌వ్రీహి ధాన్యాన్ని పండించాల‌ని ఆయ‌న సూచించారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top